Home  »  Featured Articles  »  పరాజయాలతో మొదలై.. దిగ్గజ దర్శకుడిగా ఎదిగిన మణిరత్నం!

Updated : Jun 2, 2025

 

సినీ పరిశ్రమకు వచ్చి పేరు తెచ్చుకోవాలనుకున్న ఏ దర్శకుడైనా ఒక విభిన్నమైన సినిమాతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు. ఆ విధంగా తనదైన ముద్ర వెయ్యాలని భావిస్తారు. అయితే కొన్నిసార్లు కథ, కథనాలు, దర్శకత్వం ఎంత విభిన్నంగా ఉన్నప్పటికీ అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవు. అతను తన సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు అనే విషయం అర్థం కాదు. భారతదేశంలో అత్యుత్తమ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న మణిరత్నం విషయంలో ఇదే జరిగింది. ప్రేక్షకుల అభిరుచికి భిన్నంగా సినిమాలు తియ్యడం ద్వారా ఒక దశలో మణిరత్నం అంటే నిర్మాతలు భయపడేవారు. ఆ స్థితి నుంచి మణిరత్నంలాంటి టాలెంటెడ్‌ డైరెక్టర్‌తో ఒక్క సినిమా అయినా చెయ్యాలి అని కోరుకునేంత పెద్ద దర్శకుడుగా మారారు మణిరత్నం. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడుగా పేరు తెచ్చుకోవడం వెనుక మణిరత్నం కృషి ఏమిటి? దర్శకుడుగా మొదటి అవకాశాన్ని ఎలా సంపాదించారు? ఆయన సినీ ప్రస్థానం ఎలా కొనసాగింది అనే విషయాలు తెలుసుకుందాం.

 

1956 జూన్‌ 2న తమిళనాడులోని మధురైలో జన్మించారు మణిరత్నం. ఆయన పూర్తి పేరు గోపాలరత్నం సుబ్రమణ్యం. తండ్రి గోపాలరత్నం వీనస్‌ పిక్చర్స్‌లో ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌గా ఉండేవారు. మణిరత్నం మేనమామ కృష్ణమూర్తి వీనస్‌ పిక్చర్స్‌ అధినేత. సినిమా కుటుంబమే అయినప్పటికీ పిల్లలను సినిమాలు చూడనిచ్చేవారు కాదు గోపాలరత్నం. అయినా ఇంట్లో తెలియకుండా సినిమాలు చూసేవారు మణిరత్నం. అప్పట్లో శివాజీగణేశన్‌ నటించిన సినిమాలు, కె.బాలచందర్‌ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలను ఎక్కువగా ఇష్టపడేవారు. 1977లో ముంబాయిలో ఎంబిఎ పూర్తి చేశారు. ఆ తర్వాత మద్రాస్‌లో మేనేజ్‌మెంట్‌ కన్సల్‌టెంట్‌గా ఉద్యోగం చేశారు. అయితే మణిరత్నం ఉద్యోగంలో ఇమడలేకపోయారు. ఒక సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ డిస్కషన్స్‌లో కొన్నాళ్ళు పాల్గొన్నారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాలపై దృష్టి పెట్టాలనుకున్నారు. ఆ సమయంలోనే పి.సి.శ్రీరామ్‌ పరిచయమయ్యారు. అప్పటికి అతను సినిమాటోగ్రాఫర్‌ అవ్వలేదు. ఇద్దరూ తరచూ కలుసుకొనేవారు. సినిమాలకు సంబంధించిన చర్చలు చేసేవారు. అప్పుడు సినిమాలు విపరీతంగా చూడడం మొదలుపెట్టారు మణిరత్నం. ముఖ్యంగా భారతీరాజా, కె.బాలచందర్‌, మహేంద్రన్‌ సినిమాలు చూడడం ద్వారా కథ, కథనాల విషయంలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు. అలా కొన్ని కథలు కూడా రాసుకున్నారు. వాటిలో తనకు బాగా నచ్చిన కథతో ఆ ముగ్గురు దర్శకులను కలిశారు. వారికి మణిరత్నం రాసిన కథ నచ్చలేదు. దాదాపు మూడు సంవత్సరాలపాటు 20 మంది నిర్మాతలకు ఆ కథ వినిపించినా సినిమా చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 

 

మణిరత్నం కష్టం చూసిన ఆయన మేనమామ కృష్ణమూర్తి ఓ చిన్న సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. అయితే ఆ సినిమా కన్నడలో చెయ్యాలని, తన బడ్జెట్‌ని మించి చేయకూడదని చెప్పారు. అప్పుడు అనిల్‌కపూర్‌, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో ‘పల్లవి అను పల్లవి’ అనే సినిమా చేశారు. 1983లో విడుదలైన ఈ సినిమా ఏవరేజ్‌ అనిపించుకుంది. అయితే ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌గా మణిరత్నం కర్ణాటక స్టేట్‌ అవార్డు అందుకున్నారు. తర్వాత మలయాళంలో ‘ఉన్నరూ’ అనే సినిమా చేశారు. అది ఫ్లాప్‌ అయింది. 1985లో ‘పగల్‌ నిలవు’, ‘ఇదయ కోవిల్‌’ అనే తమిళ్‌ సినిమాలు చేశారు. అవి కూడా విజయం సాధించలేదు. పల్లవి అనుపల్లవి సినిమా చేస్తున్న సమయంలోనే దివ్య పేరుతో ఓ కథ రాసుకున్నారు మణిరత్నం. అప్పటికి సక్సెస్‌ అనేది లేకపోవడంతో ఆయనతో సినిమా చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో మణిరత్నం అన్నయ్య వెంకటేశ్వరన్‌ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు. తను రాసుకున్న దివ్య కథతోనే సినిమా చెయ్యాలనుకున్నారు. మోహన్‌, రేవతి, కార్తీక్‌ ప్రధాన పాత్రల్లో ప్రారంభమైన ఈ సినిమాకి ‘మౌనరాగం’ అనే టైటిల్‌ పెట్టారు. ఈ సినిమాకి పి.సి.శ్రీరామ్‌ను సినిమాటోగ్రాఫర్‌గా తీసుకున్నారు. 1986లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించి దర్శకుడుగా మణిరత్నంకు మంచి పేరు తెచ్చింది. తెలుగులో కూడా ఇదే పేరుతో రిలీజ్‌ అయి సూపర్‌హిట్‌ అయింది. ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ సినిమాకి ఉత్తమ దర్శకుడుగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు మణిరత్నం. ఆ తర్వాత 1970లో విడుదలై సూపర్‌హిట్‌ అయిన హిందీ సినిమా ‘పగ్లా కహీ కా’ చిత్రాన్ని కమల్‌హాసన్‌తో రీమేక్‌ చెయ్యాలనుకున్నారు. కానీ, కమల్‌ ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ఏదైనా కొత్త కథ చెప్పమని మణిరత్నంని అడిగారు. 1975 నుంచి 1977 వరకు ముంబాయిలో ఎంబిఎ చదువుతున్న రోజుల్లో వరదరాజన్‌ ముదలియార్‌ అక్కడ అండర్‌ వరల్డ్‌ డాన్‌గా ఉండేవాడు. అతన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని తయారు చేసిన కథను కమల్‌కు వినిపించారు మణిరత్నం. అది ఆయనకు బాగా నచ్చింది. 1987లో ‘నాయకన్‌’ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించారు. తమిళ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించడమే కాకుండా కమల్‌హాసన్‌కు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. ఈ ఒక్క సినిమాతో జాతీయ స్థాయిలో అందరూ చర్చించుకునే స్థాయికి మణిరత్నం చేరుకున్నారు.

 

తను చేసే ప్రతి సినిమా ఒక దృశ్యకావ్యంలా ఉండాలని తపించేవారు మణిరత్నం. దానికి తగ్గట్టుగానే సినిమాలను రూపొందించారు. భారతీయ సినిమాలో ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ మణిరత్నం శైలి వేరు. ఆయన సినిమాలోని పాత్రలు, వాటి తీరుతెన్నులు ఎంతో భిన్నంగా ఉంటాయి. ప్రతి ఫ్రేమ్‌ అందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల మనసులో నిలిచిపోయేలా తీర్చిదిద్దుతారు. తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో మణిరత్నం రూపొందించిన సినిమాలన్నీ ఇదే తరహాలో ఉంటాయి. ‘నాయకన్‌’ తర్వాత ప్రభు, కార్తీక్‌ హీరోలు రూపొందించిన ‘అగ్నినక్షత్రం’ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమా తెలుగులో ‘ఘర్షణ’ పేరుతో విడుదలైంది. ఈ సినిమా తర్వాత నాగార్జునతో మణిరత్నం చేసిన ‘గీతాంజలి’ ఒక అందమైన దృశ్యకావ్యంగా నిలిచింది. నాగార్జున కెరీర్‌లో ఒక మైల్‌స్టోన్‌గా నిలిచింది. 

 

ఆ తర్వాత అంజలి, దళపతి వంటి సినిమాలు మణిరత్నంను ఇండియాలోనే టాప్‌ డైరెక్టర్‌గా నిలబెట్టాయి. ఇక ఆయన కెరీర్‌లో మరో మరపురాని సినిమా రోజా. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మణిరత్నం పేరు మారుమోగిపోయింది. ఇక అప్పటి నుంచి మణిరత్నంకి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఏర్పడిరది. ఆయన నుంచి వచ్చే సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసేవారు. జయాపజయాలతో సంబంధం లేకుండా మణిరత్నం సినిమాలను ఆదరించారు. అలా దొంగ దొంగ, బాంబే, ఇద్దరు, దిల్‌సే, సఖి, యువ, గురు, రావణ్‌, చెలియా, ఓకే బంగారం వంటి అద్భుతమైన దృశ్యకావ్యాలను ప్రేక్షకులకు అందించారు. వాటిలో కొన్ని బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినా 2022లో వచ్చిన పొన్నియన్‌ సెల్వన్‌1తో తనేమిటో మరోసారి నిరూపించుకున్నారు మణిరత్నం. ఆ తర్వాత 2023లో  విడుదలైన పొన్నియన్‌ సెల్వన్‌2 కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించాయి. తాజాగా కమల్‌హాసన్‌తో రూపొందించిన ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం జూన్‌ 5న విడుదల కాబోతోంది. 38 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత కమల్‌హాసన్‌తో రూపొందించిన ఈ సినిమా మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. 

 

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మణిరత్నం ఎన్నో పురస్కారాలు అందుకున్నారు మణిరత్నం. పద్మశ్రీ అవార్డుతోపాటు నేషనల్‌ అవార్డులు, నంది అవార్డులు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు, అంతర్జాతీయ స్థాయి అవార్డులు అనేకం ఆయన్ని వరించాయి. తాజాగా ప్రకటించిన గద్దర్‌ అవార్డులలో పైడి జైరాజ్‌ స్పెషల్‌ జ్యూరీ అవార్డుకు మణిరత్నంను ఎంపిక చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1988లో కమల్‌హాసన్‌ సోదరుడు చారు హాసన్‌ కుమార్తె, ప్రముఖ హీరోయిన్‌ సుహాసినిని వివాహం చేసుకున్నారు మణిరత్నం. వీరికి ఒక కుమారుడు నందన్‌. దర్శకుడిగానే కాదు, నిర్మాతగా మద్రాస్‌ టాకీస్‌ బేనర్‌పై ఎన్నో సినిమాలు నిర్మించారు మణిరత్నం.

 

(జూన్‌ 2 దర్శకుడు మణిరత్నం పుట్టినరోజు సందర్భంగా..)

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.